kolkata Doctor: కోల్ కతా డాక్టర్ హత్యపై నిరసనల్లో పాల్గొంటానన్న తృణమూల్ ఎంపీ
- తనకూ ఓ కూతురు ఉందన్న రాజ్యసభ ఎంపీ
- మహిళలపై అఘాయిత్యాలు ఇక చాలంటూ వ్యాఖ్య
- ఇలాంటి దారుణాలపై సంఘటితంగా పోరాడాలని పిలుపు
కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యురాలు ఓ దుండగుడి ఆకృత్యానికి బలవడంపై వైద్య సిబ్బందితో పాటు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఆందోళనల్లో తాను కూడా పాల్గొంటానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే ట్వీట్ చేశారు. మహిళలపై ఇప్పటి వరకూ జరిగిన అఘాయిత్యాలు చాలని, ఇకపై ఇలాంటి దారుణాలు జరగకూడదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘోరాలను అడ్డుకోవడానికి ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
‘కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై జరుగుతున్న నిరసనల్లో నేను కూడా పాల్గొంటా. నిరసనకారులతో గొంతు కలుపుతా. ఎందుకంటే నాకూ ఓ కూతురు ఉంది. ఓ చిన్నారి మనవరాలు ఉంది. మహిళలపై జరుగుతున్న దారుణాలను మనమంతా సంఘటితంగా అడ్డుకోవాల్సిన సమయమిది’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా నిరసనల్లో పాల్గొంటే టీఎంసీ తనపై వేటు వేసే అవకాశం ఉందన్న కామెంట్లపైనా శేఖర్ స్పందించారు.
‘పార్టీ ఎలాంటి చర్యలైనా తీసుకోనివ్వండి. నన్ను పార్టీ నుంచి తొలగించినా సరే, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. నా తలరాత గురించి ఆందోళన పడకండి. ఎందుకంటే నా ఒంట్లో స్వాతంత్య్ర సమరయోధుడి రక్తం ప్రవహిస్తోంది. ఆందోళనలలో పాల్గొనడం వల్ల ఎదురయ్యే పరిణామాలపైన నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఏం జరిగినా సరే కోల్ కతా వైద్యురాలికి జరిగిన దారుణంపై నిరసన తెలిపి తీరుతా’ అని శేఖర్ స్పష్టం చేశారు.