Sheikh Hasina: ఆందోళనల మాటున విధ్వంసం.. అల్లరి మూకలపై మండిపడ్డ షేక్ హసీనా

Dance Of Destruction In Name Of Protest Says Sheikh Hasina
  • దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • దేశం విడిచి పెట్టిన తర్వాత తొలిసారిగా స్పందించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
  • ఇలాంటి విధ్వంసకారుల వల్లే తన కుటుంబాన్ని కోల్పోయానని ఆవేదన
బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనలపై ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసనల పేరుతో కొంతమంది విధ్వంసం సృష్టిస్తున్నారని, అలాంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి భారత్ కు చేరుకున్న హసీనా తొలిసారిగా స్పందించారు. ఇలాంటి విధ్వంసకారుల వల్లే తన కుటుంబ సభ్యులు అందరినీ కోల్పోయానని, దేశం కోసం తన తండ్రి ప్రాణాలు ఇచ్చారని గుర్తుచేశారు.

బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత, మాజీ ప్రెసిడెంట్ షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారని, ఆ తర్వాత తిరుగుబాటు పేరుతో తన కుటుంబ సభ్యులు అందరినీ అల్లరి మూకలు చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి విధ్వంసానికి నిరసనగా ఆగస్టు 15న బంగబంధు, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ కు నివాళులు అర్పించాలని బంగ్లాదేశ్ ప్రజలను కోరారు. ఈమేరకు షేక్ హసీనా రాసిన మూడు పేజీల లేఖను ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ ట్వీట్ చేశారు.

ఆందోళనల మాటున జరిగిన విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారికి షేక్ హసీనా నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అల్లర్లలో బంగబంధు స్మారక చిహ్నంగా కాపాడుకుంటూ వచ్చిన తన చిన్ననాటి ఇంటిని కూల్చేశారని వాపోయారు. ప్రపంచంలో పేరొందిన గొప్ప గొప్ప నేతలు ఎందరో బంగ్లాదేశ్ లో పర్యటించినపుడు ఆ ఇంటిని సందర్శించారని గుర్తుచేశారు.

అలాంటి స్మారక చిహ్నాన్ని, స్వాతంత్ర సమరయోధుల స్మారకాలను కూల్చేశారని మండిపడ్డారు. ఈ విధ్వంసానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, తన దేశ పౌరులకు న్యాయం జరగాలని హసీనా డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆగస్టు 15ను సంతాప దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని, బంగబంధు భవన్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించాలని ప్రజలను కోరారు.
Sheikh Hasina
Bangladesh
Protests
Bangabandhu

More Telugu News