Kolkata doctor Murder: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన... తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ
- నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారన్న లోక్‌సభా ప్రతిపక్ష నాయకుడు
- ఆసుపత్రి, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సందేహాలు
- కాలేజీలోనే భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుకు ఎలా పంపిస్తారని ప్రశ్న
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తిస్తున్న కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై లోక్‌సభా ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన విషయంలో ఆసుపత్రితో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
‘‘మృతురాలి కుటుంబానికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నాన్ని చూస్తుంటే ఆసుపత్రి, స్థానిక పరిపాలన యంత్రాంగంపై తీవ్రమైన సందేహాలు కలుగుతున్నాయి’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
‘‘మెడికల్ కాలేజీ లాంటి ప్రదేశంలోనే వైద్యులకు భద్రత లేకుంటే తల్లిదండ్రులు వారి కూతుళ్లను చదివించేందుకు బయటకు ఎలా పంపుతారు? నిర్భయ ఘటన తర్వాత కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ ఇలాంటి నేరాలు ఎందుకు ఆగడం లేదు?’’ అని రాహుల్ గాంధీ నిలదీశారు.
హత్రాస్ నుంచి ఉన్నావ్ ఘటన వరకు, కథువా నుంచి కోల్‌కతా హత్యాచారం ఘటన వరకు దేశంలో నిరంతరంగా మహిళలపై జరుగుతున్న నేర ఘటనలపై ప్రతి పక్షంతో పాటు సమాజంలోని ప్రతి వర్గం చర్చలు జరపాలని, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు ఈ మేరకు హిందీలో 'ఎక్స్' వేదికగా స్పందించారు.
ప్రియాంక గాంధీ ఏమన్నారంటే..
కాగా, కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మంగళవారం నాడు స్పందించారు. ఇది హృదయ విదారకమైన ఘటనగా ఆమె అభివర్ణించారు. త్వరితగతిన కఠినమైన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. పని చేసే ప్రదేశంలో మహిళల భద్రత చాలా పెద్ద సమస్యగా మారిందని, ఈ సమస్యను అధిగమించేందకు తీవ్రమైన ప్రయత్నాలు అవసరమంటూ ఎక్స్ వేదికగా ఆమె స్పష్టం చేశారు.