Revanth Reddy: మా పోటీ ఆంధ్రప్రదేశ్‌తో కాదు... ప్రపంచంతోనే... ఎందుకంటే నా వద్ద హైదరాబాద్ ఉంది: రేవంత్ రెడ్డి
- కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం
- హైదరాబాద్‌లో తాము నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నామని వెల్లడి
- కుతుబ్ షా నుంచి చంద్రబాబు వరకు హైదరాబాద్ విషయంలో రాజీపడలేదని వ్యాఖ్య
- ఏపీలో ప్రభుత్వం మారగానే హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతాయన్నారని వెల్లడి
- పక్క రాష్ట్రాలతో తమకు పోటీ లేదన్న రేవంత్ రెడ్డి
తమ విదేశీ పర్యటన ద్వారా తెలంగాణకు రూ.31,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాము పక్షం రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించామన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... హైదరాబాద్ రెండో రింగ్ రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా సెమీ అర్బన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, బ్రిటిషర్స్ కాలంలో సికింద్రాబాద్‌ను నిర్మించారన్నారు.
1992లో నేదురుపల్లి జనార్దన్ రెడ్డి ఐటీ సెక్టార్ కోసం పునాదిరాయి వేశారని, ఆ తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోతే... చంద్రబాబు వచ్చాక హైటెక్ సిటీని నిర్మించారన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. చంద్రబాబు, వైఎస్ సైబరాబాద్‌ను మూడో నగరంగా నిర్మించారన్నారు. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్... మూడు నగరాలు ఉన్నాయన్నారు.
కులీకుతుబ్ షా మొదలు చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో రాజీపడలేదన్నారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌పై ఆ ప్రభావం పడకుండా చూశారన్నారు. అలాంటి విధానాలు కొనసాగించాలని తాము భావిస్తున్నామన్నారు.
ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో తమ ప్రభుత్వం నాలుగో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించిందన్నారు. అమెరికా, సౌత్ కొరియా సహా విదేశాలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటికి ఈ నాలుగో నగరం వేదిక అవుతుందన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందాలంటే... అలాగే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలన్నారు.
ఏపీలో ప్రభుత్వం మారగానే... తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉంటుందని, హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని మాట్లాడారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ తన పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కాదని... తన పోటీ ప్రపంచంతో అన్నారు. తన వద్ద హైదరాబాద్ నగరమే ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఉన్నాయన్నారు.
తాము పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచనను పక్కన పెట్టి ప్రపంచంతో పోటీ పడే విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. పక్క రాష్ట్రాలతో తమకు పోటీ లేదన్నారు. పక్క రాష్ట్రాల వద్ద హైదరాబాద్ వంటి నగరం లేదన్నారు. అన్నింటికంటే ఇక్కడున్న సానుకూల పరిస్థితులు ఎక్కడా లేవన్నారు. తమ వద్ద అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.