VH: నాకు పదవులు ముఖ్యం కాదు... కానీ ఈ అవకాశం మాత్రం ఇవ్వండి: వి హనుమంతరావు
- నాకు పదవులు ముఖ్యం కాదు... పార్టీ కోసమే పని చేస్తానన్న వీహెచ్
- తనకు ఓబీసీ కన్వీనర్‌గా అవకాశమిస్తే దేశమంతా తిరుగుతానని వెల్లడి
- రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తమ ఏకైక లక్ష్యమని వెల్లడి
తనకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ తీసుకోలేదని... తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ కోసమే పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు ఓబీసీ కన్వీనర్‌గా అవకాశమిస్తే దేశమంతా తిరుగుతానన్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు.
రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాలనేది తమ ఏకైక లక్ష్యమన్నారు. నిన్న ఏఐసీసీ మీటింగ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లి కార్జున ఖర్గే కులగణన చేయాలని చెప్పారని తెలిపారు. కులగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందనేది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. కులగణన 1931 తర్వాత మళ్లీ జరగలేదన్నారు.
బీజేపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ కులగణన చేయాలని చెబుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన బిల్లు పెట్టారని గుర్తు చేశారు. కులగణన కోసం రూ.150 కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించారన్నారు. ఓబీసీ ఎంపీల కన్వీనర్‌గా కొట్లాడి ఐఐటీ, ఐఐఎమ్‌లలో రిజర్వేషన్‌ను తీసుకొచ్చానని తెలిపారు. ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.