MBBS: ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్ విడుదల
- ఆగస్టు 21వ తేదీ వరకూ అన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
- 16 నుండి 18 వరకూ కన్వీనర్ కోటా సీట్లకు రిజిస్ట్రేషన్
- గత ఏడాది ప్రారంభించిన కళాశాల్లోనూ ప్రవేశాలు
ఏపీలో 2024 -25 విద్యాసంవత్సరానికి గానూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కు యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కల్పించేందుకు గానూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నిన్న నోటిపికేషన్ విడుదల చేసింది. గత ఏడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్, స్విమ్స్ లో ఎంబీబీఎస్ సీట్ల ఎన్ఆర్ఐ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ యూజీ - 2024 లో అర్హత సాధించిన విద్యార్ధులు ఈ నెల (ఆగస్టు) 21వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆగస్టు 16వ తేదీ రాత్రి 7 గంటల నుండి ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉండదని యూనివర్శిటీ తెలిపింది. ఈ వ్యవధిలో కన్వీనర్ కోటా కింద ప్రవేశాల కోసం ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రుసుము చెల్లింపు ఇలా
యాజమాన్య కోటా సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్ధులు రూ.10,620లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము రూ.30,620లతో ఆగస్టు 21వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు తలెత్తితే 89787 80501, 79977 10168 నెంబర్ లకు, సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707 నెంబర్ లకు సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు.
సీట్ల విషయానికి వస్తే..
విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 225 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా కింద 95 సీట్లు చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సిమ్స్ లో 23, ఎన్ఆర్ఐ ప్రైవేటు, మైనార్టీ మెడికల్ కళాశాలల్లో 1,078 బీ కేటగిరి, 472 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డెంటల్ కళాశాలలో 489 బీ కేటగిరి, 211 ఎన్ఆర్ఐ సీట్లు అందుబాటులో ఉన్నాయి.