Punjab Company: రాఖీ పండుగకు లీవ్ అడిగితే ఉద్యోగమే ఊడింది.. పంజాబీ మహిళ ఆవేదన
- ఒక్క రోజు లీవ్ పెడితే వారం రోజుల జీతం కట్ చేస్తామన్న మేనేజ్ మెంట్
- ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించినందుకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారని వెల్లడి
- ఆఫీసులో కూతురు హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటోందన్న కంపెనీ
రాఖీ పండుగకు సెలవు అడిగితే వీలైతే లీవ్ ఇవ్వాలి.. లేదా కుదరదని చెప్పాలి కానీ ఓ కంపెనీ ఏకంగా ఉద్యోగంలో నుంచే తీసేసింది. ఇరవై రోజులు టైమిచ్చి ఆపై కంపెనీకి రావాల్సిన అవసరం లేదని టెర్మినేషన్ లెటర్ పంపింది. ఈ ఉదంతాన్ని బాధిత హెచ్చార్ ఉద్యోగిని బబిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ కంపెనీపై మండిపడుతున్నారు.
పంజాబ్ లోని మొహాలీలో బి9 సొల్యూషన్స్ కంపెనీ ఉంది.. అందులో బబిన హెచ్చార్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కంపెనీ జారీ చేసిన ఇంటర్నల్ సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. వరుస సెలవులు రావడంతో సోమవారం (ఆగస్టు 19న) రక్షాబంధన్ అయినా తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని మేనేజ్ మెంట్ ఆర్డర్ వేసింది. ఆ రోజు డుమ్మా కొట్టినా, ఆలస్యంగా వచ్చినా ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తామని మేనేజ్ మెంట్ ఉద్యోగులను హెచ్చరించింది. దీనిపై హెచ్చార్ మేనేజర్ బబిన అభ్యంతరం చెప్పింది.
ఒక్క రోజు సెలవుకు వారం రోజుల జీతం కట్ చేయడం అన్యాయమని, దీనికి తాను ఒప్పుకోబోనని వాదించింది. అయితే, ఈ వాదన బెడిసికొట్టి ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. బబినను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఆమె బాస్ టెర్మినేషన్ లెటర్ పంపాడు. తోటి ఉద్యోగుల కోసం ఫైట్ చేస్తే తన ఉద్యోగమే ఊడిందంటూ బబిన ఈ ఉదంతాన్ని లింక్డ్ ఇన్ లో పోస్టు చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
బబిన నిర్వాకం ఇదే.. కంపెనీ యాజమాన్యం
సింపతి కార్డు వాడి సోషల్ మీడియాలో బాధితురాలిగా సానుభూతి పొందడం సులభమని బబిన ఉదంతంపై బీ9 సొల్యూషన్స్ వివరణ ఇచ్చింది. బబిన ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ లెటర్ అందుకున్న విషయం బయటపెట్టిందా అన్ని ప్రశ్నించింది. ఆఫీసులో ఫోన్ ఎక్కువగా వాడడం, వర్క్ టైంలో ఆన్ లైన్ కోర్సులు చేయడం, ఆఫీసు పని పక్కన పెట్టి కూతురు హోంవర్క్ చేస్తూ కూర్చోవడం.. ఇలాంటి పనులు చేస్తున్నందుకు బబినను చాలాసార్లు మందలించినట్లు కంపెనీ పేర్కొంది. తన విధులు పక్కన పెట్టి ఉద్యోగులతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఆగస్టు 15 నుంచి 20 వరకు లాంగ్ పెయిడ్ లీవ్ లు పెట్టాలంటూ ఉద్యోగులను రెచ్చగొడుతోందని, దీనిని అడ్డుకోవడానికే సర్క్యులర్ పంపాల్సి వచ్చిందని వివరించింది.