Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ కు పతకాన్ని దూరం చేసిన గ్లాసు పళ్లరసం
- సెమీస్ కు ముందు 49.9 కిలోల బరువున్న ఫొగాట్
- పళ్ల రసంతో పాటు ఫ్లూయిడ్స్, స్నాక్స్ తీసుకోవడంతో 3 కేజీలు పెరిగిన అథ్లెట్
- 9 గంటలు శ్రమించినా అదనపు బరువును వదిలించుకోలేక పోయిన వైనం
ఒలింపిక్స్ పోటీల్లో అదనపు బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ పతకం కోల్పోయింది.. దీనిపై అప్పీల్ కు వెళ్లినా ఆమెకు ఊరట దక్కలేదు. సెమీస్ కు ముందు 49.9 కిలోల బరువున్న ఫొగాట్ ఒక్క రోజులోనే 3 కిలోల బరువు పెరిగింది. దీంతో ఆమె బరువు 52.7 కిలోలకు చేరింది. అదనపు బరువును వదిలించుకోవడానికి ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి వ్యాయామం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. నిబంధనల కన్నా 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ప్రత్యర్థిపై గెలిచినప్పటికీ ఫొగాట్ కు పతకం దక్కకుండా పోయింది. అయితే, వినేశ్ ఫొగాట్ ఉన్నట్టుండి బరువు పెరగడానికి సెమీస్ కు ముందు ఆమె తీసుకున్న డైట్ కారణమని నిపుణులు చెబుతున్నారు.
వినేశ్ ఫొగాట్ తీసుకున్న డైట్ ఇదే..
ఒక గ్లాస్ పళ్ల రసం, ఫ్లూయిడ్స్, లైట్‌గా స్నాక్స్.. సెమీస్ కు ముందు వినేశ్ ఫొగాట్ తీసుకున్న డైట్ ఇది. 300 గ్రాములు సమానమైన జ్యూస్‌ను తాగడంతో పాటు ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకుంది. సెమీస్ బౌట్ ముగిశాక.. కొద్దిపాటి స్నాక్స్ తీసుకుంది. దీంతో ఆమె 3 కిలోల బరువు పెరిగిందని స్పోర్ట్‌స్టార్ రిపోర్ట్ వెల్లడించింది. అదనపు బరువును వదిలించుకోవడానికి 6 గంటల పాటు ట్రెడ్ మిల్ పై శ్రమించింది, 3 గంటల పాటు సౌనా బాత్, చుక్క నీరు కూడా తీసుకోలేదు. అయినా అవసరమైన మేర బరువు తగ్గకపోవడంతో ఫొగాట్ దుస్తులకు ఉన్న ఎలాస్టిక్ ను, జుట్టును కోచ్ లు తీసేశారు. ఆ తర్వాత కూడా 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో వినేశ్ ఫొగాట్ పై వేటు పడింది.