Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రాను నియమిస్తూ ఉత్తర్వులు
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ
- 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యూనివర్సిటీ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది.
యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇటీవల రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం లక్షమందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్సిటీని విస్తరించనున్నారు. సొంతభవనం నిర్మించే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో కార్యకలాపాలు కొనసాగుతాయి.