Balakrishna: బాలయ్య ఇలాకాలో వైసీపీకి భారీ షాక్
- వైసీపీకి మున్సిపల్ ఛైర్మన్ సహా మరో 8 మంది కౌన్సిలర్ల రాజీనామా
- బాలయ్య సమక్షంలో టీడీపీలో చేరిక
- మరొక్కరు చేరితే హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ వశం
అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందనే చెప్పుకోవాలి. వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పలు చోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా... బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కూడా వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో ఆయన సమక్షంలో వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని బాలకృష్ణ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో టీడీపీలో చేరామని చెప్పారు. మరోవైపు హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ, ఎంఐఎం తరపున ఒక్కొక్కరు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం కౌన్సిలర్ టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో 9 మంది చేరడంతో టీడీపీ బలం 19కి చేరింది. మరొక్కరు చేరితే మున్సిపాలిటీ టీడీపీ వశం అవుతుంది. ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కలుపుకుంటే టీడీపీ బలం 21కి చేరుతుంది. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.