Jogi Ramesh: ఎన్ని కేసులు పెట్టినా భయపడను: విచారణ అనంతరం జోగి రమేశ్
- చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరైన జోగి రమేశ్
- నిరసన తెలిపేందుకే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని వ్యాఖ్య
- రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శ
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్ దాడి చేసేందుకు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున తన అనుచరులతో వెళ్లిన జోగి రమేశ్... బాబు నివాసంపై దాడికి యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి మంగళగిరిలోని పీఎస్ లో విచారణకు జోగి రమేశ్ హాజరయ్యారు. తనతోపాటు ఘటన సమయంలో వినియోగించిన కారు, ఫోన్ ను తీసుకొచ్చారు.
పోలీసుల విచారణ అనంతరం మీడియాతో జోగి రమేశ్ మాట్లాడుతూ... ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. కేవలం నిరసన తెలిపేందుకు మాత్రమే తాను చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని చూస్తుంటే... చంద్రబాబు, లోకేశ్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై చంద్రబాబు కక్షసాధింపులకు దిగారని అన్నారు. తన కుమారుడిని కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.