Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కాదు... ఆలస్యానికి కారణాలు ఇవే!

Maharashtra assembly election is not now these are the reasons for the delay
  • జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
  • జమ్మూకశ్మీర్ లో భద్రతా అవసరాల దృష్ట్యా   మహారాష్ట్ర ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించలేదన్న సీఈసీ
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని సీఈసీ వెల్లడి
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు జమ్మూకశ్మీర్ తో పాటు హర్యానా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని రాజకీయ పార్టీలు భావించాయి. ఆ విధంగా ప్రచారం కూడా సాగింది. అయితే సీఈసీ రాజీవ్ కుమార్ ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదంటే ..?
జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదనే అంశంపై సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ లో భద్రతా అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నందు వల్ల ఓటరు జాబితా పబ్లికేషన్ ఆలస్యం అయిందనీ ఆయన పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలో ప్రస్తుతం పితృపక్షం, దీపావళి, గణేశ్ చతుర్ధి వంటి ముఖ్యమైన పండుగలు, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, కావున ఈ కారణాల రీత్యా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
 
గతంలో హర్యానాతో పాటుగా మహారాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే అప్పుడు జమ్మూకశ్మీర్ కి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలు జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎన్నికల సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు మాత్రమే ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రాలకు శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకూ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని, ఈ నేపథ్యంలో ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్ధవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
Maharashtra
Assembly Elections
Delay

More Telugu News