Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నట్టేనా...?

Did Vinesh Phogat take back his retirement
  • సోషల్ మీడియాలో వినేశ్ ఉద్వేగభరిత పోస్టు
  • 2032 వరకూ ఆడే సత్తా ఉందని వ్యాఖ్య 
  • ఇక్కడితో పోరాటం ఆపనన్న వినేశ్  
పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్న తన కల చెదిరిపోవడంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైనల్స్ కు ముందు వంద గ్రాములు ఎక్కువ బరువు కల్గి ఉండటంతో ఆమె అనర్హత వేటుకు గురయ్యారు. ఫైనల్స్ కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు వినోశ్ ఫోగాట్ కఠోర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. జుట్టు కత్తిరించుకుంది. గంటల పాటు వ్యాయామం చేసింది. అయినప్పటికీ వంద గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేశ్ ఫైనల్ ఆడలేకపోయింది. ఈ మనస్తాపంతో వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించారు.
 
అయితే ఆమె రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె చేసిన ఉద్వేగభరిత పోస్టు రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నట్లుగా ఉంది. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ ఒత్తిడికి లొంగనని .. ఇంకా రెజ్లింగ్ ఆడే సత్తా తనలో ఉందని వినేశ్ వెల్లడించింది. ఇక్కడితో పోరాటం ఆపను, ప్రస్తుతం నా సమయం కాదు. కోట్లాది భారతీయులు, నా బృందం, కుటుంబం అనుకున్న లక్ష్యం పూర్తి కాలేదు. అయితే పరిస్థితులు ఇకపై మునుపటిలా ఉండవు. 2032 వరకు ఆడే సత్తా ఉందేమో అనుకుంటున్నా. కానీ భవిష్యత్ ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నమ్మిన దాని గురించి పోరాటం ఆపను అని వినేశ్ రాసుకొచ్చింది. కోచ్ వోలర్, జట్టు వైద్యుడు దిన్షా పర్థీవాలా పట్టుదల వల్లే ఒలింపిక్స్ కు వెళ్లగలిగానని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలిపింది.
 
కాగా, అనర్హత వేటు తర్వాత వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దంటూ ఆమెకు పలువురు సూచించారు. ఈ తరుణంలో వినేశ్ చేసిన సోషల్ మీడియా పోస్టుతో ఆమె రిటైర్మెంట్ వెనక్కుతీసుకున్నట్లే అన్న కామెంట్స్ వినబడుతున్నాయి.
Vinesh Phogat
Sports News

More Telugu News