Vinesh Phogat: ఢిల్లీ ఎయిర్ పోర్టులో వినేశ్ ఫోగాట్ భావోద్వేగం.. వీడియో ఇదిగో!

Vinesh Phogat breaks down after reaching the Delhi airport
  • ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • వారి అభిమానం చూసి కంటతడి పెట్టిన రెజ్లర్
  • ఓదార్చిన సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్వాగతించేందుకు వచ్చిన అభిమానులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. రెజ్లింగ్ లో వినేశ్ ఫైనల్ కు చేరినా అధిక బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే, వినేశ్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. పతకం గెలిచిన క్రీడాకారుడికన్నా ఎక్కువగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి వినేశ్ బయటకు రాగానే బ్యాండ్ మేళంతో, పూలమాలలతో తోటి రెజ్లర్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. అది చూసి వినేశ్ కన్నీటిని ఆపుకోవడానికి విఫలయత్నం చేశారు. విమానాశ్రయం బయట కారులో వినేశ్ ను ఊరేగింపుగా తీసుకెళుతుండగా కంటతడి పెట్టారు. దీంతో పక్కనే ఉన్న తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వినేశ్ ను ఓదార్చారు. కాగా, ఒలింపిక్స్ లో సెమి ఫైనల్ మ్యాచ్ లో వినేశ్ విజయం సాధించినా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై వేటు పడింది. సెమీస్ విజయంతో రజతం ఖాయమైనా అధిక బరువు వల్ల పతకం దక్కలేదు. దీనిపై వినేశ్ ఫోగాట్ చేసిన అప్పీలును కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్‌(కాస్‌) తిరస్కరించింది.
Vinesh Phogat
breaks down
Delhi airport
Grand Welcome
Sakshi Malik
Bajarang Punia

More Telugu News