Ayyana Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్న స్పీకర్
- జగన్ ప్రతిపక్ష హోదాపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తామని వెల్లడి
- కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఉంటుందన్న అయ్యన్న
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే తప్పకుండా వారికి మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు.
ఇక జగన్ ప్రతిపక్ష హోదాపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పీకర్ తెలియజేశారు. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
దీనిలో భాగంగా రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యతపై వారికి అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో తిరిగి మంచి రోజులు వచ్చాయన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్యన్నపాత్రుడు తెలిపారు.