Ayyanna Patrudu: 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ మొక్కను నాటాను: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- తిరుపతిలో పర్యటించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- నగరంలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ సందర్శన
- అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మొక్క నాటినట్టు వెల్లడి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో పర్యటించారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ ను సందర్శించారు. తన పర్యటన వివరాలను అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
"24 ఏళ్ల కిందట నేను అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కును సందర్శించి ఓ మొక్కను నాటాను. నేడు అసెంబ్లీ స్పీకర్ హోదాలో, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి తాజాగా ఓ మొక్కను నాటాను.
పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత. అన్ని రాష్ట్రాలలో మొక్కలు పెంచుతుంటే, గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా చెట్లు నరికేశారు. అసలు అన్ని చెట్లు ఎందుకు నరికేశారో వాళ్లకే తెలియదు.
నేను అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కోరోజులోనే లక్ష మొక్కలు నాటిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉంది. మళ్లీ అలాంటి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరాను" అని అయ్యన్నపాత్రుడు వివరించారు. ఈ మేరకు తన పర్యటన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.