Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: కోల్‌కతా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించిన నిర్భయ తల్లి

Nirbhaya mother speaks on Kolkata rape murder
  • మమతా బెనర్జీ తన అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేయాల్సిందన్న నిర్భయ తల్లి
  • సీఎంగా ఉండి అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
  • నిందితులకు కఠిన శిక్షలు విధించే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్య
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం మమతా బెనర్జీ తన అధికారాన్ని ఉపయోగించవచ్చునని... కానీ ఆమె అలా చేయలేదని విమర్శించారు. తన అధికారంతో అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయకపోగా... నిరసనలో పాల్గొనడం విడ్డూరమన్నారు. సీఎంగా ఉండి అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఆమె రాష్ట్రానికి అధినేత... హత్యాచార ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే స్థాయిలో ఆమె ఉన్నప్పటికీ అలా చేయలేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైనందుకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ కొరవడిందన్నారు. కొంతమంది మహిళల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఏ స్థాయిలో భద్రత ఉందో కోల్‌కతా హత్యాచార ఘటన మరోసారి రుజువు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రంగా పరిగణించి... నిందితులకు కఠిన శిక్షలు విధించే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు.
Mamata Banerjee
West Bengal
Kolkata
Nirbhaya

More Telugu News