Bunny Vasu: దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాస్ ఆసక్తికర స్పందన
- సినీ ఇండస్ట్రీలో ఐక్యత లేదని అభిప్రాయపడ్డ బన్నీ వాస్
- ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని అభిప్రాయం
- ఓటీటీలలో సినిమాల విడుదల విషయంలో బాలీవుడ్‌లా వ్యవహరించాలని వ్యాఖ్య
- థియేటర్‌కు జనాలు రావాలంటే సందర్భం ఉండాలని అభిప్రాయం
చిత్ర పరిశ్రమలో ఐక్యత లేకపోతే ఏమీ చేయలేమని ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాస్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని బాధలు పడినా.. ఏం చేసినా ఏమీ చేయలేమని అన్నారు. ‘మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే ఓటీటీలో మూవీ తీసుకొస్తాం’ అంటూ సినీ నిర్మాత దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా బన్నీ వాస్ ఈ విధంగా స్పందించారు. ‘ఆయ్’ సినిమా ‘ఫన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్’లో భాగంగా ఆయన పలు అంశాలపై స్పందించారు. ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపైనా మాట్లాడారు.
థియేటర్‌కు జనం రావాలంటే ఏదైనా సందర్భం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒక మూడ్ క్రియేట్ అయితే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రారని వ్యాఖ్యానించారు. మహేశ్‌బాబు పుట్టినరోజు ఉంది కాబట్టే ‘మురారి’కి మంచి ఆదరణ లభించిందని అన్నారు.
ఫిలిం ఛాంబర్ లేదా ఇంకెవరైనా రూల్స్ పెడితే సక్సెస్ అయ్యేది కాదని, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని బన్సీ వాస్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు థియేటర్‌కు రాకుండా తామే చెడగొట్టామంటూ దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి.. 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్లు ఇవ్వమని బాలీవుడ్ తీసుకున్న కఠిన నిబంధనను ఇక్కడ కూడా అమలు చేయాలని బన్నీ వాస్ అభిప్రాయపడ్డారు.
ఇది వరకు ఉన్నట్లు థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేవని బన్నీ వాస్ వ్యాఖ్యానించారు. ‘ఆయ్’ మూవీకి ప్రస్తుతం వరుస సెలవులు వచ్చాయి కాబట్టే 42 నుంచి 45 శాతం ఓపెనింగ్ అయ్యిందని బన్నీ వాస్ అన్నారు. ఇక ‘ఆయ్’ మూవీకి భారీగా పబ్లిసిటీ చేసి సాధారణ రోజుల్లో విడుదల చేస్తే 20-25 శాతం ఓపెనింగ్ వస్తుందని పేర్కొన్నారు. అలా కాకుండా మౌత్ టాక్‌తో వెళ్తే మూడో వారానికి ఊపందుకుంటుందని అంచనా వేశారు.