Donald Trump: ప్రత్యర్థి కమలా హ్యారీస్ కంటే నేనే మంచిగా కనిపిస్తాను: డొనాల్డ్ ట్రంప్

I am Much Better Looking than Kamala Harris says Donald Trump
  • కమలా కంటే మెరుగ్గా ఉంటానని మాజీ అధ్యక్షుడి వ్యాఖ్య
  • ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌’లో కమలా అందాన్ని అభివర్ణిస్తూ ప్రచురితమైన కథనానికి ట్రంప్ కౌంటర్
  • పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో రిపబ్లికన్ అభ్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.వైస్ ప్రెసిడెంట్, ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హ్యారీస్ కంటే తానే చూడడానికి మెరుగ్గా కనిపిస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘ఆమె కంటే నేను చాలా మెరుగ్గా ఉంటాను. నేనే మంచిగా ఉంటానని భావిస్తున్నానని’’ ట్రంప్ అన్నారు. ఈ మేరకు పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు.

‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌’లో హ్యారీస్‌ను అందాన్ని అభివర్ణిస్తూ ప్రచురితమైన కాలమ్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమెను అందంగా వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ ఈ వ్యాసాన్ని రాశారు. కాగా ఆడవాళ్ల అందాలను పొగడవద్దంటూ ర్యాలీలోనే ఉన్న రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్‌‌కు సూచన చేసినట్టుగా ట్రంప్ చెప్పారు. ‘‘ఇలాంటివి మాట్లాడడానికి మీకు అనుమతి లేదు. ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దు. దయచేసి స్త్రీని ఎప్పుడూ అందంగా ఉన్నారని అనకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు అవుతుంది’’ అని మాజీ అధ్యక్షుడు అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై ఉన్నది హీరోయిన్స్ సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అని అనుకున్నానని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక ఈ శుక్రవారం కమలా హ్యారీస్ ప్రకటించిన ఆర్థిక ప్రణాళికపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాలో కమ్యూనిజానికి బీజం వేసే ప్రణాళిక ఇదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఉద్దేశిస్తూ ఇది ‘మదురో ప్లాన్’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గత మూడు వారాలుగా హ్యారిస్‌పై ట్రంప్ విమర్శల పదును పెంచారు. వ్యక్తిగత దూషణలకు సైతం ఆయన వెనుకాడడం లేదు. కమలకు ‘పిచ్చి’ అని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Donald Trump
Kamala Harris
US Presidential Polls
USA

More Telugu News