Hyd Pubs: హైదరాబాద్ లో పబ్ లపై పోలీస్ రైడ్స్.. 50 మంది అరెస్టు
- డ్రగ్స్ అరికట్టడంలో భాగంగా అధికారుల రైడ్స్
- స్పాట్ డ్రగ్ టెస్టింగ్ తో అనుమానితులకు పరీక్షలు
- పబ్ యజమానులకు పోలీసుల సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ లో డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పబ్ లలో డ్రగ్స్ వాడకం పెరుగుతున్న క్రమంలో తరచూ దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి సిటీలోని పలు పబ్ లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 12 బృందాలు పాల్గొన్నాయి. స్పాట్ డ్రగ్ టెస్టుల ద్వారా అనుమానితులను పరీక్షించారు. సుమారు 50 మంది అనుమానితులలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పబ్ యజమానులకు అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్ కు వచ్చే కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతించాలని సూచించారు. అదేవిధంగా, పబ్ యాజమాన్యం కానీ, పబ్ లో పనిచేసేవాళ్లు కానీ.. ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.