KTR: రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం

KTR wrote Rahul Gandhi and Kharge on loan waiver issue
  • రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు ద్రోహం చేసిందన్న కేటీఆర్
  • లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టిందని ఆరోపణ
  • రూ.2 లక్షల రుణమాఫీ హామీపై మడమతిప్పారని విమర్శలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మకద్రోహానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు లేఖాస్త్రం సంధించారు. 

తెలంగాణలోని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని, రుణ మాఫీ చేస్తామన్న హామీ విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. 

ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఘనంగా ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉందని, అరకొర రుణమాఫీతో సరిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్షల సంఖ్యలో  రైతులు ఉండగా, వారిలో రుణమాఫీ అందనివారే ఎక్కువమంది ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రైతులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, వారికి రుణమాఫీ నిరాకరించారని ఆరోపించారు. 

రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, కానీ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతపెట్టారని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ లో ఓ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తే... వారం రోజుల వ్యవధిలోనే లక్ష ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. 

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 36.68 లక్షల మంది రైతులకు రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేసిందని కేటీఆర్ తెలిపారు. కానీ, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను 14.31 లక్షల మేర తగ్గించిందని వెల్లడించారు. 47 లక్షల మంది రైతులకు గాను 22.37 లక్షల మందినే చూపిస్తోందని ఆరోపించారు.
KTR
Loan Waiver
Farmers
Rahul Gandhi
Mallikarjun Kharge
BRS
Congress
Telangana

More Telugu News