Ongolu EVM: బాలినేని ప్రతినిధుల వాకౌట్​... ఒంగోలులో నిలిచిన ఈవీఎం రీవెరిఫికేషన్

Ongolu EVM Reverification Process Stopped
  • ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ లు కూడా లెక్కించాలని పట్టుబట్టిన బాలినేని ప్రతినిధులు
  • కుదరదని అధికారులు తేల్చిచెప్పడంతో వాకౌట్ 
  • హైకోర్టులో బాలినేని రిట్ పిటిషన్ రేపటికి వాయిదా
ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. రీవెరిఫికేషన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తరఫున హాజరైన ప్రతినిధులు వాకౌట్ చేయడంతో అధికారులు ప్రక్రియను ఆపేశారు.

సోమవారం ఉదయం కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి, భెల్ సిబ్బంది ఈవీఎంల రీ చెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. బాలినేని తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు. దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో బాలినేని తరఫున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపేశారు. 

మరోవైపు, ఈవీఎంల రీ చెకింగ్ పై హైకోర్టులో బాలినేని దాఖలు చేసిన రిట్ పిటిషన్ రేపటికి (మంగళవారం) వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ లు కూడా లెక్కించాలంటూ మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. 

బాలినేని తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ పద్ధతిలో ఈవీఎంల చెకింగ్ చేపట్టిందని, అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంగళవారం తమ వాదనలు వినిపిస్తామని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది చెప్పడంతో కోర్టు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
Ongolu EVM
EVM Reverification
Balineni
AP High Court

More Telugu News