Damodara Raja Narasimha: మంకీపాక్స్‌పై సచివాలయంలో దామోదర రాజనర్సింహ సమీక్ష
- తెలంగాణలో కేసులు నమోదు కాలేదన్న అధికారులు
- అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచన
- అవసరమైన మెడికల్ కిట్స్, మందులు అందుబాటులో ఉంచాలని సూచన
- గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలన్న మంత్రి
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంకీ పాక్స్‌పై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ, చెన్నైలలో మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు... మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. తరచూ ప్రయాణాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని సూచించారు.
అవసరమైన మెడికల్ కిట్స్, మందులను అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.