Vangalapudi Anitha: అస్వస్థతకు గురైన చిన్నారుల గురించి చంద్రబాబు, లోకేశ్ ఆరా తీశారు: హోంమంత్రి అనిత
- అనకాపల్లి జిల్లాలో ఓ అనాథాశ్రమంలో విద్యార్థులకు అస్వస్థత
- కలుషితాహారం తిన్న వైనం
- అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నారన్న అనిత
అనకాపల్లి జిల్లాలో ఓ అనాథాశ్రమంలో ఆహారం వికటించి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం తెలిసిందే. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించారు. హాస్టల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టళ్లపై చర్యలు ఉంటాయని అనిత స్పష్టం చేశారు.
కాగా, అనాథాశ్రమం విద్యార్థులు బయటి నుంచి వచ్చిన ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని వివరించారు. బాధితుల్లో 3 ఏళ్ల చిన్నారి కూడా అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. అస్వస్థతకు గురైన చిన్నారుల గురించి చంద్రబాబు, లోకేశ్ ఆరా తీశారని అనిత వెల్లడించారు.
చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఐదుగురికి ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని చెప్పారు. అక్కడ హాస్టల్ ఉందని అధికారులకు కూడా తెలియదని, అనధికారికంగా హాస్టల్ నిర్వహిస్తున్నారని అనిత పేర్కొన్నారు.
హాస్టల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ చేస్తున్నామని తెలిపారు. 92 మందిలో 82 మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు.
కాగా, ఆసుపత్రిలో చిన్నారులను పరామర్శించిన సందర్భంగా అనిత వెంట టీడీపీ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.