Joe Biden: అందరి ముందు కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ పై ఫైర్
- డెమోక్రాటిక్ పార్టీ సభలో బైడెన్ కంటతడి
- అమెరికా రాజకీయాల్లో హింసకు తావు లేదన్న బైడెన్
- యూఎస్ కు 50 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించానని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... షికాగోలో జరిగిన డెమోక్రాటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. బైడెన్ వేదికపైకి రాగానే ఆయన కూతురు యాష్లీ బైడెన్ మాట్లాడుతూ... తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని చెప్పారు. మహిళలకు ఆయన విలువనివ్వడం, వారిని నమ్మడం తాను చూశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర భావోద్వేగానికి గురైన బైడెన్... కంటతడి పెట్టుకున్నారు. వెంటనే పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... 'అమెరికా... ఐ లవ్యూ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
అమెరికా రాజకీయాల్లో హింసకు తావు లేదని... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బైడెన్ అన్నారు. అమెరికా గౌరవం చాలా ముఖ్యమని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... మంచి మౌలిక వసతులు లేకపోతే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎలా నిలవగలమని ప్రశ్నించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి వారం మౌలిక వనరులపై వాగ్దానాలు చేస్తూ వెళ్లారే తప్ప... ఒక్క పని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కానీ మన ప్రభుత్వంలో ఎయిర్ పోర్టులు, పోర్టులు, రైళ్లు, బస్సులను ఆధునికీకరించామని... హైస్పీడ్ నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని బైడెన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేశామని, దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చామని అన్నారు. కానీ, అమెరికాను కుప్పకూలుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణిస్తారని, ఈ విధంగా మాట్లాడుతూ ప్రపంచానికి ఆయన ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారని మండిపడ్డారు.
గత 50 ఏళ్లుగా అమెరికాకు అత్యుత్తమ సేవలను అందించానని బైడెన్ అన్నారు. దీనికి ప్రతిఫలంగా లక్షల రెట్ల అభిమానం అమెరికన్ల నుంచి వచ్చిందని చెప్పారు. ఇకపై తన బాధ్యతలను కమలా హారిస్, టిమ్ వాల్జ్ కొనసాగిస్తారని తెలిపారు. వీరికి తాను అత్యుత్తమ వాలంటీర్ మాదిరి పని చేస్తానని చెప్పారు.