Yuvraj Singh: యువరాజ్ సింగ్ 17 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన యువ ఆటగాడు!
- టీ20 ప్రపంచ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు
- సమోవా, వనువాటు మధ్య మ్యాచ్‌లో అరుదైన రికార్డు నమోదు
- ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్
- యువీ, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, దీపేంద్ర సింగ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన యువ క్రికెటర్
ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్-2026 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్ టోర్నీలో తాజాగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. 28 ఏళ్ల అనామక ఆటగాడు భారత స్టార్ క్రికెటర్ యూవరాజ్ సింగ్ 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం ద్వారా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించాడు. ఇప్పుడా రికార్డును సమోవా దేశ ఆటగాడు డేనియల్ విస్సెర్ బద్దలుకొట్టాడు. విస్సెర్ ఒకే ఓవర్లో 39 పరుగులు చేసి యువీ రికార్డును అధిగమించాడు.
అయితే, తాజాగా క్వాలిఫయర్ లో భాగంగా సమోవా, వనువాటు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ఒకే ఓవర్ లో 39 పరుగులు సాధించాడు. సమోవా ఇన్నింగ్స్ లోని 15వ ఓవర్ లో ఆరు సిక్స్‌లు బాదాడు. అదనంగా బౌలర్ మరో మూడు నో బాల్స్ కూడా వేయడంతో ఒకే ఓవర్ లో 39 రన్స్ వచ్చేశాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లోని ఆరు బాల్స్‌కు ఆరు సిక్సర్ల వీరుల జాబితాలో చేరిపోయాడు డేరియస్ విస్సెర్.
అయితే, ఇప్పటి వరకు యువరాజ్ సింగ్ కాకుండా ఈ జాబితాలో కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దీపేంద్ర సింగ్ (2024) మాత్రమే ఈ అరుదైన ఫీట్ ను సాధించారు. ఇక సమోవా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో శతకం (62 బంతుల్లో 132 పరుగులు) సాధించిన తొలి క్రికెటర్ గానూ డేరియస్ రికార్డుకెక్కడం విశేషం. అతని సంచలన ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు, 5 బౌండరీలు నమోదయ్యాయి.
కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అందులోనూ డేరియస్ శతకం చేయగా, సారథి కలేబ్ జస్మత్ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించడం గమనార్హం. ఆ తర్వాత 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన వనవాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సమోవా పది పరుగుల తేడాతో విజయం సాధించింది.