BRS: రుణమాఫీ కోసం ఈ నెల 22న నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

BRS call for protest on Loan Waiver

  • మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా
  • ఈ మేరకు ప్రకటన చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • పెద్ద సంఖ్యలో రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేదన్న కేటీఆర్

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, అందరికీ రుణాలు మాఫీ చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు రుణమాఫీ ప్రయోజనం పొందలేదని, దీంతో వారు ఆందోళనలో ఉన్నారన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతున్నారని, మరోవైపు మంత్రులు మాత్రం సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ పూర్తి కాలేదని చెబుతున్నారని... ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నరని ఆరోపించారు.

రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, కానీ కేబినెట్ మాత్రం రూ.31 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలపడం ద్వారా రైతులను మోసం చేశారన్నారు. ఈ రూ.26 వేల కోట్లలో కేవలం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు.

రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షలాది మంది రైతులు రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు... రుణమాఫీపై అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.

  • Loading...

More Telugu News