Amaravati: ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల భేటీ

World Bank and ADB delegation met AP CM Chandrababu in Amaravati
  • అమరావతికి నిధులు అందించే విషయంపై చర్చ
  • దశల వారీగా నిధుల విడుదలకు ప్రతిపాదనలు
  • మూడు రోజుల పాటు అమరావతిలో పర్యటించనున్న బ్యాంకుల ప్రతినిధులు
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు నేడు ఏపీ రాజధాని అమరావతి విచ్చేశారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు వారికి వివరించారు. 

రాజధానిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులను, తమ విధాన నిర్ణయాలను బ్యాంకుల ప్రతినిధుల ఎదుట ప్రస్తావించారు. దశల వారీగా నిధుల విడుదలపై చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూసమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు. 

అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అందిస్తామని ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి రుణం ఇచ్చే విషయమై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

కాగా, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు మూడు రోజుల పాటు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ నెల 27 వరకు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Amaravati
Chandrababu
World Bank
ADB
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News