BJP: రాజ్యసభ ఉపఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

BJP has fielded 9 candidates for Upcoming Rajya Sabha by Election
  • 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • కేంద్ర మంత్రులు రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజస్థాన్ నుంచి, జార్జ్ కురియన్‌‌ మధ్యప్రదేశ్ నుంచి పోటీ
  • సెప్టెంబర్ 3న 12 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నిక
సెప్టెంబర్ 3న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను, మరో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‌‌ను మధ్యప్రదేశ్ నుంచి బరిలోకి దింపినట్టు తెలిపింది. బీహార్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా, ఒడిశా నుంచి మాజీ బీజేడీ నేత మమతా మొహంతా, త్రిపుర నుంచి రాజీబ్ భట్టాచార్జీ పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

అసోం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలి, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పలువురు నేతలు లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 

కాగా రాజ్యసభ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టినవారిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. ఇక కామాఖ్య ప్రసాద్ (బీజేపీ), మిషా భారతి (ఆర్‌జేడీ), వివేక్ ఠాకూర్ (బీజేపీ), దీపేందర్ సింగ్ హుడా (కాంగ్రెస్), ఉదయన్‌రాజే భోంస్లే (బిజేపీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), బిప్లబ్ కుమార్ దేబ్ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
BJP
Rajya Sabha by Election
Rajya Sabha

More Telugu News