justice hema: మలయాళ సినీ పరిశ్రమలో కీచకులు... జస్టిస్ హేమా కమిటీ నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
- మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు అందిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక
- మాఫియా గ్యాంగ్ కంట్రోల్ లో మలయాళ చిత్ర సీమ
మలయాళ సినీ పరిశ్రమలో మహిళల వేధింపుల గురించి విచారణ చేసేందుకు 2019లో కేరళ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ హేమ నేతృత్వంలోని ఈ కమిటీలో నటి శారద, విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఈ కమిటీ .. మలయాళ సినీ పరిశ్రమలో జరుగుతున్న అకృత్యాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు నివేదిక అందించింది. కమిటీ నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం అయింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీ ద్వేషం ఎక్కువగా ఉందని కమిటీ నివేదికలో పేర్కొంది. పలువురు ప్రముఖ నటీమణులు సైతం తాము లైంగిక వేధింపులకు గురయ్యామని కమిటీ ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. సినిమాలో అవకాశం లభించాలంటే నటీమణులు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కమిటీ తేల్చి చెప్పింది. ఫిర్యాదు చేస్తే కుటుంబానికి బెదిరింపులు వస్తాయని, సినిమాల నుండి తొలగిస్తారని భయపడి పోలీసులను ఆశ్రయించడం లేదని నివేదికలో కమిటీ పేర్కొంది.
మలయాళ చిత్ర పరిశ్రమను ఓ మాఫియా గ్యాంగ్ కంట్రోల్ చేస్తోందన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక హీరో నటిని కౌగిలించుకునే సన్నివేశాన్ని కావాలనే 17 టేక్స్ తీసుకున్నారని బాధిత నటి తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా హేమ కమిటీ నివేదికలో వెల్లడించింది. దాదాపు 55- 56 పేజీలతో హేమ కమిటీ .. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక నేరాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం.