AP High Court: బాలినేని రీకౌంటింగ్ పిటిషన్ పై ముగిసిన విచారణ .. తీర్పు రిజర్వ్

AP high court on ysrcp leader balineni srinivasa reddy evm petition
  • సుప్రీం కోర్టు తీర్పును బాలినేని తప్పుగా అర్దం చేసుకున్నారన్న ఈసీ తరపు న్యాయవాది
  • మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందని వెల్లడి   
  • ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్ లు సరిపోల్చాలని కోరుతున్న బాలినేని        
ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొన్ని ఈవీఎంలలో ఓట్లు లెక్కించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు రిజర్వు చేశారు. ఎన్నికల ఫలితాల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్ధుల వినతి మేరకు ఈవీఎం, వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దానికి భిన్నంగా .. మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 16 జులై 2024న ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను జారీ చేసిందని బాలినేని తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. బాలినేని తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. 
 
అయితే పిటిషనర్ల తరపు వాదనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్ధం చేసుకున్నారని వాదనలు వినిపించారు. వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించి ఈవీఎంలో పోలైన ఓట్లతో సరి పోల్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. ఈవీఎంలో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తారని, అది ఏమైనా ట్యాంపర్ జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే అభ్యర్ధుల సమక్షంలో సాంకేతిక నిపుణులు పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
AP High Court
YSRCP
Balineni Srinivasa Reddy

More Telugu News