jitender Reddy: డిసెంబర్ లోపు తెలంగాణలో నూతన క్రీడా పాలసీ
- క్రీడాకారుల సంక్షేమం, కొత్త కోచ్ ల నియామకం, క్రీడా రంగం అభివృద్ధికి దశాదిశను నిర్దేశించేలా నూతన క్రీడా పాలసీ
- క్రీడా శాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి చైర్మన్ గా క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ
- సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో శాట్జ్ కొత్త లోగో ఆవిష్కరిస్తామన్న శివసేనా రెడ్డి
డిసెంబర్ లోపు నూతన క్రీడా పాలసీ రూపకల్పన పూర్తి చేస్తామని ముసాయిదా క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్, తెలంగాణ క్రీడా శాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి అన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఇటీవల ప్రభుత్వం నియమించింది.
శాట్జ్ చైర్మన్ శివసేనారెడ్డి సహా 11 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉండగా, బుధవారం జితేందర్ రెడ్డి అధ్యక్షతన ముసాయిదా క్రీడా పాలసీపై సమీక్ష నిర్వహించారు. కమిటీ తొలి సమావేశానికి క్రీడా శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, శాట్జ్ వీసీ ఎండీ సోనీబాలాదేవి, ఒలింపిక్ సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ హాజరయ్యారు.
క్రీడాకారుల సంక్షేమం, కొత్త కోచ్ ల నియామకం, క్రీడా రంగం అభివృద్ధికి దశాదిశను నిర్దేశించేలా నూతన క్రీడా పాలసీ రూపొందిస్తామని శివసేనా రెడ్డి తెలిపారు. ఈ నెల 30న మరో మారు క్రీడా రంగ నిపుణులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. శాట్జ్ కొత్త లోగోను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని శివసేనా రెడ్డి తెలిపారు.