Manchu Lakshmi: కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు: మంచు లక్ష్మి
- మలయాళ పరిశ్రమపై జస్టిస్ హేమ కమిటీ సంచలన నివేదిక
- మహిళలకు సమాజంలో సరైన స్థానం లేదన్న మంచు లక్ష్మి
- మహిళలు ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, పారితోషికం, క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలపై నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ... ఈ సమాజంలో మహిళలకు సరైన స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో ఏముందో తనకు పూర్తిగా తెలియదని... అయితే సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అన్యాయం జరిగిన వెంటనే మహిళలు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నీకు జరిగిన అన్యాయం గురించి నీవు ఎవరితోనూ చెప్పలేవని... నీకు అంత ధైర్యం లేదని భావించిన కొందరు నిన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తారని మంచు లక్ష్మి అన్నారు. కెరీర్ ప్రారంభంలో తనను కూడా కొందరు ఇబ్బంది పెట్టారని... అలాంటి వారితో తాను దురుసుగా ప్రవర్తించేదాన్నని... ఇదే కారణంతో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నానని చెప్పారు.