Mamata Banerjee: అత్యాచార ఘటనలు... ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ
- అత్యాచార కేసులపై కఠిన చట్టాన్ని తీసుకురావాల్సి ఉందన్న మమత
- దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని ఆవేదన
- సత్వర న్యాయం కోసం 15 రోజుల్లో విచారణను పూర్తి చేసేలా చట్టంలో చేర్చాలని సూచన
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అత్యాచార కేసులపై కఠిన చట్టాన్ని తీసుకురావాల్సి ఉందని ఆ లేఖలో కోరారు. సీఎం లేఖ రాసినట్లు ఆమె ముఖ్య సలహాదారు బందోపాధ్యాయ ధృవీకరించారు. దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న అత్యాచార కేసులను ప్రధాని దృష్టికి మమత తీసుకువెళ్లారని బందోపాధ్యాయ తెలిపారు.
దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మన దేశం, సమాజ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావించేలా చేయడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.
ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షను విధించేలా కఠినమైన చట్టం తీసుకురావడం ద్వారా తీవ్రమైన, సున్నితమైన ఈ సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రతిపాదిత చట్టంలో చేర్చాలన్నారు. సత్వర న్యాయం కోసం విచారణను 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.