Narendra Modi: భారత్ ఎప్పుడూ తటస్థ దేశం కాదు... శాంతివైపే మేముంటాం: ప్రధాని మోదీ
- ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
- కీవ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో చర్చలు
- తాము యుద్ధానికి దూరంగా ఉంటామని మోదీ ఉద్ఘాటన
- యుద్ధానికి దూరంగా ఉండడం అంటే తటస్థ వైఖరి కాదని స్పష్టీకరణ
ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థంగా ఉందంటూ తరచుగా వినిపిస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ సమక్షంలో మోదీ మాట్లాడుతూ... భారత్ ఎప్పుడూ తటస్థంగా ఉండాలనుకోదని, భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధానికి దూరంగా ఉండాలన్న దృఢనిశ్చయంతో తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామని ఉద్ఘాటించారు.
యుద్ధానికి దూరంగా ఉండడం అంటే తటస్థ మార్గాన్ని ఎంచుకున్నట్టు కాదని, మొదటి రోజు నుంచే శాంతి స్థాపన దిశగా బలంగా నిలబడ్డామని మోదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాల్లో సంప్రదింపులు, చర్చల ద్వారానే శాంతి సాకారం అవుతుందన్న వాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ఈ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలకు తమ సహకారం ఉంటుందని అన్నారు.
"నేను వచ్చింది బుద్ధ భగవానుడు, మహాత్మా గాంధీ నడయాడిన గడ్డ నుంచి. యుద్ధం అనే అంశానికి మా వద్ద తావు లేదు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది కూడా శాంతి సందేశంతోనే" అని మోదీ స్పష్టం చేశారు.