Andhra Pradesh: ఏపీలోని యూనివర్శిటీలన్నింటికీ ఒకే చట్టం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
- ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయం
- ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 యూనివర్శిటీలు
- వీటన్నింటికీ వేర్వేరు చట్టాలు
- ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణ బాధ్యత ఉన్నత విద్యామండలికి అప్పగింత
- బోర్డు ఆఫ్ గవర్నర్స్‌ను తెచ్చి పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం
గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో తీసుకుచ్చిన మార్పులను ఇప్పటి కూటమి సర్కార్ ప్రక్షాళన చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 యూనివర్శిటీలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణచేసే బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. కొత్త చట్టాన్ని డిసెంబరులోపు రూపొందించాలని విద్యామండలికి సర్కార్ ఆదేశించింది.
అలాగే యూనివర్శిటీల పాలకమండళ్ల స్థానంలో బోర్డు ఆఫ్ గవర్నర్స్‌ను తెచ్చి పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో కొత్తగా బోర్డు ఆఫ్ గవర్నర్స్‌ను తీసుకురానున్నారు. పారిశ్రామికవేత్తలను సభ్యులుగా నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. అలాగే ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్‌కే బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది.
ఇక ట్రిపుల్ ఐటీల కోసం రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా దీనికి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది.
వైసీపీ హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా ముఖ్యమంత్రి ఉండేలా మార్చడం జరిగింది. ఈ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.