AP High Court: ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో బిగ్ షాక్

bhimili beach take action on the construction undertaken by mp vijayasai reddy daughter
  • భీమిలి బీచ్ వద్ద నేహారెడ్డి అక్రమ నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేత మూర్తి యాదవ్ 
  • నేహారెడ్డి అక్రమ నిర్మాణం కూల్చివేతకు హైకోర్టు అనుమతి
  • తదుపరి విచారణ సెప్టెంబర్ 11కి వాయిదా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌ జడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ ప్రహరీగోడ విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్ వాదనలు వినిపించారు. నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని, అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ పిటిషన్ పై సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనానికి తెలియజేశారు. స్టే ఉత్తర్వులు లేనప్పుడు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.
AP High Court
Vijay Sai Reddy
Visakhapatnam

More Telugu News