Maharaja T20 Trophy 2024: ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు.. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
- కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో అరుదైన ఘటన
- హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు
- మూడో సూపర్ ఓవర్లో హుబ్లీ టైగర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బిగ్ బాష్ లీగ్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వంటి లీగ్‌లతో అభిమానులకు వినోదం అందించడానికి టీ20 ఫార్మాట్ ప్రసిద్ధి. ఇక టీ20ల్లో మ్యాచ్ డ్రాగా ముగిసినప్పుడు వినిపించే మాట సూపర్ ఓవర్. అంటే.. ఇరు జట్లకు చెరో ఓవర్ కేటాయించి మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం జరుగుతుంది. అయితే, టీ20ల్లో ఒక సూపర్ ఓవర్ ఆడటమే చాలా అరుదుగా జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే.
అలాంటిది ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వస్తే. మహారాజా టీ20 టోర్నమెంట్లో ఇదే జరిగింది. కర్ణాటక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఏకంగా మూడు సూపర్ ఓవర్లకు దారి తీసింది.
మొదట హుబ్లీ నిర్ణీత 20ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు కూడా 20 ఓవర్లలో 164 రన్సే చేసింది. దీంతో తొలి సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో బెంగళూరు 10/1 స్కోరు చేసింది. ఆ తర్వాత హుబ్లీ కూడా 10/0 స్కోరే చేసింది.
దాంతో మ్యాచ్ మళ్లీ రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇందులో బెంగళూరు 8/0, హుబ్లీ 8/1 స్కోర్లు చేశాయి. దీంతో మ్యాచ్‌లో మరో సూపర్ ఓవర్ తప్పలేదు. ఇలా మూడోసారి సూపర్ ఓవర్ వేయగా బెంగళూరు 12/1 స్కోరు చేసింది. ఆ తర్వాత హుబ్లీ 13/1 స్కోరు చేసి విజయం సాధించింది. కాగా, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇలా మూడు సూపర్ ఓవర్లు ఆడటం ఇదే తొలిసారి.