Union Cabinet: మూడు కీలక పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- విదేశీ పర్యటన ముగించుకుని భారత్ తిరిగొచ్చిన ప్రధాని మోదీ
- ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం
- కీలక పథకాలపై చర్చ... ఆమోదం
పోలెండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారత్ తిరిగొచ్చారు. ఇవాళ ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది.
బయో ఈ-3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయిమెంట్), విజ్ఞాన్ ధార పథకం... 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ పథకానికి కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది.
క్యాబినెట్ భేటీపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. బయో మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం నూతనంగా బయో ఈ-3 కార్యాచరణను తీసుకువస్తోందని వివరించారు. త్వరలో బయో విప్లవం రానుందని, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఇక... సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ఆవిష్కరణలు, టెక్నాలజీ వృద్ధి వంటి విభాగాలను 'విజ్ఞాన్ ధార' పథకంలో సమ్మిళితం చేశారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తద్వారా నిధుల వినియోగం, అనుబంధ పథకాలు, కార్యక్రమాల మధ్య సమన్వయం సులభతరమవుతుందని పేర్కొన్నారు.
11, 12వ తరగతి చదివే విద్యార్థులకు కొత్తగా ఇంటర్న్ షిప్ ఉంటుందని, దీనికి కేంద్రం ఆమోదం లభించిందని తెలిపారు.
ఈ మూడు పథకాలతో పాటు ఏకీకృత పింఛను విధానానికి కూడా కేంద్ర క్యాబినెట్ సమ్మతి లభించిందని వెల్లడించారు. ఉద్యోగులకు సామాజిక భద్రతను అందించే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.