Rahul Gandhi: మిస్ ఇండియా పోటీదారుల జాబితా చూశాను... దళితులు ఒక్కరూ లేరు: రాహుల్ గాంధీ
- రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- క్రీడలు, బాలీవుడ్, మీడియాలో దళిత, గిరిజన, ఓబీసీలకు చోటు లేదని వెల్లడి
- రాహుల్ వ్యాఖ్యలను పిల్లవాడి మాటలుగా కొట్టిపారేసిన కేంద్రమంత్రి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా జరిగిన మిస్ ఇండియా పోటీల జాబితా చూశానని... పోటీదారుల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో 'కుల గణన' అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మిస్ ఇండియా పోటీల్లో దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం లోపించిందని తెలిపారు. రిజర్వేషన్ల గురించి ఎల్లప్పుడూ మాట్లాడుతుంటారు కానీ, వారికి ఎప్పుడూ అవకాశం ఇవ్వరని విమర్శించారు. క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడతారు... ఇలాంటి అంశాలపై స్పందించరు... మీడియాలోని టాప్ యాంకర్లలోనూ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారు లేరు అని వ్యాఖ్యానించారు. వివిధ సంస్థల్లో ఆయా కులాల ప్రాతినిధ్యం గురించిన డేటాను పరిశీలించాల్సి ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను పిల్లవాడి మాటలుగా కొట్టిపారేశారు. తెలిసీ తెలియని మనస్తత్వం కలిగిన పిల్లవాడిగా రాహుల్ ను అభివర్ణించారు.
"అతడు (రాహుల్) మిస్ ఇండియా పోటీల్లో, క్రీడల్లో, బాలీవుడ్ లో రిజర్వేషన్లు కావాలంటున్నాడు. అతడంటే పిల్ల మనస్తత్వం కలిగినవాడు కాబట్టి మాట్లాడతాడు... కానీ, అతడ్ని సమర్థించే వాళ్లు కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పిల్ల చేష్టలతో నవ్వించడం వినోదానికి బాగానే ఉంటుంది. కానీ మీ విభజన ఎత్తుగడల కోసం వెనుకబడిన వర్గాలతో తమాషా చేయకండి. ఇలాంటి పోకడలకు దూరంగా ఉంటే మంచిది" అని కిరణ్ రిజిజు హితవు పలికారు.
రాహుల్ గారూ... మీరు ఒక్క విషయం గమనించాలి... మిస్ ఇండియా పోటీదారులను ప్రభుత్వం ఎంపిక చేయదు, ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను సెలెక్ట్ చేసేది ప్రభుత్వం కాదు, సినిమాల కోసం నటీనటులను ఎంపిక చేయడం ప్రభుత్వం పని కాదు అని వ్యాఖ్యానించారు.