Raghunandan Rao: హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు: రఘునందన్ రావు
- రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్న రఘునందన్ రావు
- డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన
- ప్రజలు చనిపోతుంటే కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఏం పని? అంటూ ఆగ్రహం
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే, హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను అందరూ చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ప్రజాసమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఓవైపు డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, కానీ, కాంగ్రెస్ నేతలు ప్రజలను వదిలేసి ఢిల్లీలో తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఏం పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే రాష్ట్రంలోని ఆసుపత్రులను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నిధులు ఆగిపోతాయని వెల్లడించారు.