Urvashi: ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ని... జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ దిగ్భ్రాంతి కలిగించింది: నటి ఊర్వశి
- మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితిపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్
- ఇలాంటి వ్యక్తుల మధ్య ఉన్నామా అని భయమేసిందన్న ఊర్వశి
- అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ వేధింపులు ఉన్నాయని వెల్లడి
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ కేరళ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలు ఇటీవల బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో, సీనియర్ నటి ఊర్వశి స్పందించారు.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లోని అంశాలు దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు. ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నామా అనే ఆలోచనతో భయమేసిందని తెలిపారు. తనలాగా ఎందరో మహిళలు ఉపాధి కోసం సినిమాల్లో పనిచేస్తున్నారని, ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చే నటీమణులు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఊర్వశి అభిప్రాయపడ్డారు.
ఆ రోజుల్లో తాను స్టార్ హీరోయిన్ ని అని, తనకు తల్లిదండ్రుల మద్దతు ఉండేదని, తన విషయాలను వారు నిరంతరం పరిశీలిస్తుండేవారని వివరించారు.
వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో తాను ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదని, అయితే మలయాళంలోనే కాకుండా అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో వేధింపులు ఉన్నాయన్న విషయం తనకు తెలుసని అన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలకు సంబంధించి హేమ కమిటీ రిపోర్ట్ అనేక అంశాలను ఎత్తిచూపిందని, వాటిపై కేరళ ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఊర్వశి కోరారు.