Harish Rao: పార్టీ మారడం లేదనే పల్లాను టార్గెట్ చేశారు: హరీశ్ రావు

Harish Rao take a dig at Congress govt

  • పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
  • అనురాగ్ వర్సిటీ భవనాలు అక్రమ నిర్మాణాలంటూ ఫిర్యాదు
  • వర్సిటీకి చైర్మన్ గా ఉన్న పల్లా
  • పల్లాను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్న హరీశ్ రావు
  • హైడ్రాను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని ఆగ్రహం

మేడ్చల్ మల్కాజిగిరిలోని అనురాగ్ యూనివర్సిటీ భవనాలు అక్రమ నిర్మాణాలు అంటూ తెలంగాణ ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దాంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఈ విధంగా దాడులు చేస్తున్నారని, హైడ్రా పేరుతో కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైడ్రాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. 

పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని, ఆయనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందని అన్నారు. పార్టీ మారడంలేదని పల్లాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే, హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రాజకీయ కక్ష చూపొద్దని హితవు పలికారు.

  • Loading...

More Telugu News