Shikhar Dhawan: శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందన... ఆసక్తికర వ్యాఖ్యలు

Ravi Shastri expressed heartfelt tribute to Shikhar Dhawan retiremt career

  • రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేయాలన్న రవిశాస్త్రి
  • జట్టు కోచ్‌గా, డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆనందాన్ని, వినోదాన్ని పంచాడంటూ భావోద్వేగం
  • ఎక్స్ వేదికగా స్పందించిన రవిశాస్త్రి

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్‌కు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది. శిఖర్ ఆడిన ఇన్నింగ్స్‌, అతడి బెస్ట్ మూమెంట్స్‌ను గుర్తుచేసుకుంటూ ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీలు, అభిమానులు తమ సందేశాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా చేరిపోయారు. రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేయాలంటూ రవిశాస్త్రి అభిలాషించారు.

‘‘ కోచ్‌గా, టీమ్ డైరెక్టర్‌గా నా 7 ఏళ్ల కెరీర్‌లో ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని అందించావు. ఐసీసీ టోర్నమెంట్‌లు, ఆసియా కప్‌లలో మ్యాచ్‌లను గెలిపించిన నీ ఇన్నింగ్స్, గాలెలో ఆడిన మరపురాని బ్యాటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీకు ఇంకా వయసు ఉంది. క్రికెట్‌కు నీ వంతు తోడ్పాటు అందించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నీపై దేవుడి అనుగ్రహం ఉండాలి’’ అంటూ శిఖర్ ధావన్‌కు రవిశాస్త్రి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఈయన ఎక్స్ వేదికగా స్పందించారు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు శిఖర్ ధావన్ శనివారం ప్రకటించాడు. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడిన అతడు ఎక్కువగా వన్డేలు ఆడాడు. మొత్తం 167 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్ 17 సెంచరీలు, 39 అర్ధసెంచరీలతో 6,793 పరుగులు బాదాడు. వన్డేల్లో అతడి సగటు 44.1గా ఉంది.

ఇక టెస్ట్ క్రికెట్‌లో 34 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ 40.6 సగటుతో 2,315 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌ విషయానికి వస్తే 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ధావన్ 11 అర్ధ సెంచరీలతో కలుపుకొని 27.9 సగటుతో మొత్తం1,759 పరుగులు బాదాడు. దేశవాళీ క్రికెట్‌లో మొత్తం 122 మ్యాచ్‌లు ఆడి 44.26 సగటుతో 8,499 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 29 అర్ధసెంచరీలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News