Reliance Jio: జియో యూజర్లకు కంపెనీ అలర్ట్.. అలాంటి కాల్స్, మెసేజులు నమ్మొద్దని హెచ్చరిక

Scammers stealing sensitive information posing as Jio representatives
  • జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్న కేటుగాళ్లు
  • అప్రమత్తంగా ఉండాలంటూ జియో హెచ్చరిక
  • థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోమంటూ కంపెనీ కోరబోదని సూచన
మోసాలకు అలవాటైన కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేసేందుకు మోసగాళ్లు జిత్తులమారి మార్గాలను వెతుకుతున్నారు. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్న కొందరు కేటుగాళ్ల వ్యవహారం తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన రిలయన్స్ జియో స్వయంగా కస్టమర్లను అప్రమత్తం చేసింది. జియో పేరిట జనాలను మోసగిస్తున్నారని, మోసగాళ్లు జియో ప్రతినిధులుగా నటిస్తూ సున్నిత సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ తరహా సైబర్ మోసాలకు సంబంధించి నమోదైన కేసులు తమ దృష్టికి వచ్చాయంటూ కస్టమర్లను జియో అప్రమత్తం చేసింది.

ఇలా నమ్మిస్తున్నారు..
కేటుగాళ్లు పాన్‌ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, సిమ్ వంటి వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్‌ చాట్‌, ఫోన్ కాల్‌లు, మెసేజులు, ఈ-మెయిల్స్‌తో పాటు ఇతర మార్గాల్లో కస్టమర్లను సంప్రదిస్తున్నారు. జియో ప్రతినిధులుగా నమ్మించి వివరాలు అడుగుతున్నారని జియో పేర్కొంది. కోరిన వివరాలు అందించకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక థర్డ్-పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారని, తద్వారా మొబైల్, కంప్యూటర్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని పొందుతున్నారని జియో అలర్ట్ చేసింది.

థర్డ్-పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ-మెయిల్ ద్వారా వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయమని కస్టమర్లను కోరబోమని జియో పేర్కొంది. కాగా సిమ్‌పై ఉండే 20 అంకెల సిమ్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని జియో సూచించింది. యాప్‌లు, ఆన్‌లైన్ ఖాతాల పాస్‌వర్డ్‌లు, పిన్‌ నంబర్‌లను మార్చుతూ ఉండడం మంచిదని సూచించింది.
Reliance Jio
Jio
Scammers
Cybercrime

More Telugu News