NASA: పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతమైన ఫొటో షేర్ చేసిన నాసా
- పసిఫిక్‌పై చంద్రుడి అస్తమయ ఫొటో షేర్ చేసిన నాసా
- ఫిదా అవుతున్న నెటిజన్లు
- చిత్రాన్ని బంధించిన నాసా వ్యోమగామి డొమినిక్
- 4 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలోనే ఉన్న నాసా వ్యోమగామి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అప్పుడప్పుడు మన విశ్వానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా అమెరికా స్పేస్ ఏజెన్సీ విడుదల చేసే ఖగోళ దృశ్యాలు అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తుంటాయి. విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. భూమి, అంతరిక్షం ఫొటోలతో పాటు ఎన్నో ఎడ్యుకేషనల్ వీడియోలను పంచుకునే సానా తాజాగా మరో అద్భుతమైన ఫొటోను విడుదల చేసింది.
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అస్తమయానికి సంబంధించిన అద్భుత ఫొటోను విడుదల చేసింది. దాదాపు 4 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తున్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ ఫొటోను తీశారు. ‘‘పసిఫిక్ సముద్రం మీద చంద్రుడు అస్తమిస్తున్నాడు. హవాయి సమీపంలో ఏర్పడిన ఉష్ణమండల తుపాను ‘హోన్’ని చిత్రీకరించడానికి వెళ్లాం. అయితే తుపాను మమ్మల్ని దాటిన తర్వాత చంద్రుడి అస్తమయం మొదలైంది’’ అని నాసా వ్యోమగామి డొమినిక్ పేర్కొన్నారు. ఈ ఫొటోకు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా నాసా వెల్లడించింది. ‘‘400ఎంఎం, ఐఎస్‌వో 500, 1/20000ఎస్ షట్టర్ స్పీడ్, ఎఫ్2.8, క్రాప్డ్, డీనాయిస్డ్’’ అని పేర్కొంది.
కాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిత్రంలోని మేఘాలు, భూవాతావరణం నుంచి నీలం రంగులతో కనిపిస్తున్న చందమామ రూపం అద్భుతం అనిపిస్తోంది. ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాసా షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షల వ్యూస్, వేలలో లైక్స్ లభించాయి. ‘గొప్ప ఫొటో షాట్!’’ అంటూ ఓ నెటిజన్ ప్రశంసించాడు. ఈ ఫోటో తన హృదయాన్ని తాకిందని మరో యూజర్ రాసుకొచ్చాడు. అంతరిక్షం చాలా అందంగా ఉందని మరో వ్యక్తి పేర్కొన్నాడు.