Gods at Six O'Clock: వచ్చిన పని మర్చిపోయి తీరిగ్గా పుస్తకం చదువుతూ దొరికిపోయిన దొంగ.. ఆ పుస్తకాన్ని బహుమతిగా పంపిస్తానన్న రచయిత
- ఇటలీ రాజధాని రోమ్‌లో ఘటన
- ఇంట్లో కనిపించిన పుస్తకం చదవడంలో నిమగ్నమై పరిసరాలు మర్చిపోయిన వైనం
- చివరికి ఇంటి యజమానే లేచి తట్టి లేపితే పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన దొంగ
- పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి పూర్తి చేయిస్తానన్న పుస్తక రచయిత
మనం ఏ పని చేస్తున్నామో, దానిపైనే పూర్తి ఏకాగ్రత పెట్టకుంటే ఏమవుతుందో చెప్పేందుకు ఇదో చక్కని ఉదాహరణ. చోరీకి వచ్చిన ఓ దొంగ ఆ పని మర్చిపోయి ఇంట్లో కనిపించిన పుస్తకం చదువుతూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. చివరికి పారిపోయే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిందీ ఘటన.
రాజధానిలోని ప్రతి జిల్లాలో బాల్కనీ ద్వారా ఓ ఫ్లాట్‌లోకి చొరబడిన 38 ఏళ్ల దొంగ విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగా ‘హోమర్స్ ఇలియడ్’ పుస్తకం కనిపించింది. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకం అతడిని ఆకర్షించింది. దానిని చదవకుండా ఉండలేకపోయాడు. తాను చోరీకి వచ్చిన విషయం మర్చిపోయి కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడం మొదలుపెట్టాడు.
71 ఏళ్ల ఇంటి యజమాని లేచి చూసేసరికి ఓ ఆగంతుకుడు తన ఇంట్లో పరిసరాలు మర్చిపోయి పుస్తకం చదవడంలో లీనమైన విషయాన్ని గుర్తించాడు. యజమాని వచ్చిన విషయాన్ని కూడా గుర్తించని దొంగ పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయాడు. చివరికి యజమానే అతడి భుజంపై చేయి వేసి తట్టాడు. దీంతో ఈ లోకంలోకి వచ్చిన దొంగ.. వచ్చిన దారినే పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు.
ఆ దొంగను అంతగా ఆకర్షించిన పుస్తకం ఏంటో తెలుసా? ‘గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. దీనిని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ. చోరీకి వచ్చి పుస్తకం చదవకుండా ఉండలేకపోయిన దొంగ విషయం తెలిసిన నుచీ.. ఆ దొంగను ఎలాగైనా వెతికి పట్టుకుని ఆ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పారు. అతడు దొరికిపోయే సరికి సగం పుస్తకం మాత్రమే చదివి ఉంటాడని, కాబట్టి పుస్తకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు.