suicide drone: నియంత చేతిలో మరో ప్రమాదకర ఆయుధం... సూసైడ్ డ్రోన్

North Korean leader Kim Jong Un oversees suicide drone tests
  • స్వయంగా పరీక్షించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
  • వీడియో ఫుటేజీ విడుదల చేసిన అధికారిక మీడియా
  • భూ, సముద్ర ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేలా తయారీ
ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ ఉన్ చేతికి ‘సూసైడ్ డ్రోన్’ రూపంలో మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. 

ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఓ డ్రోన్ గాల్లోకి లేవడం, వేగంగా దూసుకెళ్లి యుద్ధ ట్యాంకును ఢీ కొట్టడం, ఆపై భారీ పేలుడు చోటుచేసుకోవడం.. తదితర ఘటనలకు సంబంధించిన ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి. 

మిగతా డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. అయితే, ఈ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీ కొట్టి పేలిపోతుంది. తద్వారా అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. 

భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్లతో ఛేదించవచ్చని కిమ్ చెప్పారు. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను పరీశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. తాజా సూసైడ్ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారుచేసి సైన్యానికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
suicide drone
Kim Jong Un
North Korea
drone test

More Telugu News