Rajinikanth: గడ్డం నెరిసి, పళ్లు ఊడిపోయినా నటిస్తూనే ఉంటారు: రజనీకాంత్ కు తమిళనాడు మంత్రి చురక

Minister Durai Murugan counters Rajinikanth Old Student remarks
  • రజనీకాంత్ వర్సెస్ దురై మురుగన్
  • పాత విద్యార్థులు క్లాస్ ను వదిలి పోవడం లేదంటూ రజనీ సెటైర్
  • ముసలి నటుల వల్ల కొత్త నటులకు అవకాశాలు రావడంలేదంటూ మురుగన్ కౌంటర్
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కొందరు పెద్ద నటులు వయసు పెరిగి, గడ్డం నెరిసి, పళ్లు ఊడిపోయి, చావబోయే స్థితిలో కూడా సినిమాలు చేస్తూనే ఉంటారని రజనీకాంత్ కు దురై మురుగన్ చురక అంటించారు. ఇలాంటి వృద్ధ నటుల వల్ల కొత్త నటులకు అవకాశాలు రాకుండా పోతున్నాయని తెలిపారు. 

రజనీకాంత్ అంతటివాడిని మంత్రి దురై మురుగన్ టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. శనివారం నాడు జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు దురై మురుగన్ కు ఆగ్రహం తెప్పించాయి.

ఇంతకీ రజనీ ఏమన్నారంటే... "ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. స్కూల్లో కొత్త విద్యార్థులను మేనేజ్ చేయడం ఏమంత కష్టం కాదు. కానీ వచ్చిన చిక్కంతా పాత విద్యార్థులతోనే. ఇక్కడ (డీఎంకేలో) చాలామంది పాత విద్యార్థులు ఉన్నారు. పైగా వాళ్లేమీ సాధారణ విద్యార్థులు కాదు... ఎవరికి వారే అసాధారణమైన పాత విద్యార్థులు! 

వీళ్లంతా కూడా ర్యాంకులు తెచ్చుకుంటుంటారు.... కానీ తరగతి గదిని మాత్రం విడిచిపోరు. సరిగ్గా చెప్పాలంటే... దురై మురుగన్ కూడా అలాంటి పాత విద్యార్థే. ఇంతకుమించి ఇంకేం చెప్పగలం. అయితే, స్టాలిన్ సర్ (సీఎం)... మీరు పాత విద్యార్థులను కూడా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు... మీకు హ్యాట్సాఫ్" అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. 

రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి దురై మురుగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. "సరిగ్గా ఇలాంటి పరిస్థితే చిత్రసీమలో కూడా ఉంది. గెడ్డాలు పెరిగిపోయి, పళ్లూడిపోయి బోసి నోటితో కూడా నటించే ముసలి నటులు ఉన్నప్పుడు యువ కళాకారులు అవకాశాలు కోల్పోతున్నారని మేం కూడా చెప్పగలం" అని కౌంటర్ ఇచ్చారు. 

దురై మురుగన్ తనపై సెటైర్ వేయడాన్ని రజనీకాంత్ తేలిగ్గా తీసుకున్నారు. దురై మురుగన్ తన గురించి మాట్లాడిన మాటలను తాను పట్టించుకోబోనని, తామిద్దరం ఎప్పటి నుంచో స్నేహితులమని, తమ స్నేహం ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

దాంతో, దురై మురుగన్ మళ్లీ స్పందించారు. తాను కూడా అదే చెబుతానని, తమ జోకులను ఎవరూ శత్రుత్వంగా భావించరాదని స్పష్టం చేశారు. రజనీకాంత్, తాను ఎప్పటికీ స్నేహితులమేనని పేర్కొన్నారు.
Rajinikanth
Durai Murugan
Old Student
DMK
Kollywood
Tamil Nadu

More Telugu News