Apple: యాపిల్ సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు
- యాపిల్ కొత్త చీఫ్ సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కెవాన్ ఫరేక్ నియామకం
- 2025 జనవరి 1తో ముగియనున్న ప్రస్తుత సీఎఫ్ఓ లూకా మాస్త్రి పదవీకాలం
- ఆయన స్థానంలోనే కెవాన్ ఫరేక్ బాధ్యతలు
- 11 ఏళ్లుగా యాపిల్‌లో వివిధ పదవులలో కొనసాగుతున్న ఫరేక్
- సీఎఫ్ఓగా కెవాన్ ఫరేక్ నియామకంపై సీఈఓ టిమ్ కుక్ హర్షం
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా భారత సంతతికి చెందిన కెవాన్ ఫరేక్‌ను నియమించింది. ప్రస్తుత సీఎఫ్ఓ లూకా మాస్త్రి పదవీకాలం 2025 జనవరి 1తో ముగియనుంది. ఆయన స్థానంలోనే కెవాన్ ఫరేక్ బాధ్యతలు చేపడతారని యాపిల్ ప్రకటించింది.
యాపిల్ సీఎఫ్ఓగా కెవాన్ ఫరేక్ నియామకంపై సీఈఓ టిమ్ కుక్ హర్షం వ్యక్తం చేశారు. "ఒక దశాబ్దానికి పైగా యాపిల్ ఫైనాన్స్ లీడర్‌షిప్ టీమ్‌లో కెవాన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై మంచి అనుభవం ఉంది. ఆయన తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఆర్థిక నైపుణ్యం యాపిల్ తదుపరి సీఎఫ్ఓగా ఎంపికయ్యేలా చేశాయి" అని కుక్ అన్నారు.
కాగా, యాపిల్ సంస్థలో చేరడానికి ముందు కెవాన్ ఫరేక్ థామ్సన్ రాయిటర్స్, జనరల్ మోటార్స్ సంస్థల్లో వివిధ పదవులలో బాధ్యతలు నిర్వహించారు.
మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. అలాగే షికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన ఆయన గత 11 ఏళ్లుగా యాపిల్ సంస్థలో పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన యాపిల్ సంస్థలో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్టర్ రిలేషన్స్, మార్కెట్ రిసెర్చ్, బెనిఫిట్స్ ఫైనాన్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అంతకుముందు ప్రపంచ మార్కెటింగ్ ఫైనాన్స్, సేల్స్, రిటైల్ విభాగానికి నాయకత్వం వహించారు.